పార్టీనీ వీడకు.. విజయశాంతిని కలిసిన మాణిక్యం ఠాకూర్..!

Thursday, November 5th, 2020, 12:16:10 AM IST

తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు, రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి కాంగ్రెస్ పార్టీనీ వీడి బీజేపీలో చేరబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ రాములమ్మతో భేటీ అవ్వడంతో ఆ ప్రచారానికి మరింత ఊపునిచ్చింది. అయితే ఇప్పటికే పలువురు కీలక నేతలను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న రాములమ్మను వదులుకునేందుకు ఇష్టపడడంలేదు.

అందుకే విజయశాంతిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్యం ఠాకూర్ నేడు విజయశాంతితో భేటీ అయ్యారు. దీంతో విజయశాంతి పలు విషయాలను ఠాగూర్ దృష్టికి తీసుకెళ్ళినట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో తనకు జరిగిన అవమానాన్ని విజయశాంతి స్పష్టంగా ఠాకూర్‌కి వివరించినట్టు తెలుస్తుంది. సుధీర్ఘంగా ఆమెతో చర్చించిన మాణిక్యం ఠాకూర్ తప్పకుండా పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని, పార్టీ వీడే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని విజయశాంతిని కోరినట్టు సమాచారం.