నేడు ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ.. చర్చించే అంశాలు ఇవే..!

Tuesday, October 6th, 2020, 07:26:55 AM IST

ఏపీ సీఎం జగన్ నేడు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. రెండు వారాల వ్యవధిలో సీఎం జగన్ రెండో సారి ఢిల్లీ పర్యటనకు వెళ్ళడంతో రకరకాల ఊహాగానాలకు తెరలేచింది. అయితే ప్రధానంగా వైసీపీని బీజేపీ NDA కూటమిలోకి ఆహ్వానిస్తుందన్న టాక్ బలంగా వినిపిస్తుంది. అయితే మొదటి నుంచి కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలను వైసీపీ సమర్ధిస్తూ వస్తుంది. ఇటీవల కేంద్రం ప్రతిపాదించిన వ్యవసాయ బిల్లులకు కూడా వైసీపీ మద్దతివ్వడంతో వైసీపీ బీజేపీకి మరింత దగ్గరవుతుందన్న ప్రచారం ఊపందుకుంది.

అయితే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు కేంద్ర కేబినెట్‌లో మంత్రి పదవి, సహాయ మంత్రి పదవి ఇస్తే NDAలో చేరేందుకు వైసీపీ సిద్దంగా ఉందని ఇందుకు బీజేపీ కూడా సానుకూలంగానే ఉన్నట్టు ఢిల్లీ వర్గాల నుంచి తెలుస్తుంది. అయితే ఇదే జరిగితే ఎంపీ విజయసాయిరెడ్డికి కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని కూడా అంటున్నారు.

అయితే రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, పోలవరం ప్రాజెక్టు పూర్తి అంశం, రాష్ట్రానికి కేంద్ర సాయంగా ఇవ్వాల్సిన నిధులపై సీఎం జగన్ ప్రధానితో చర్చించబోతున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే బయటకు ఇది చెబుతున్నా తెరవెనుక మాత్రం NDA కూటమిలో భాగస్వామ్యులు అయ్యేందుకే భేటీ అంటూ రాజకీయ నిపుణులు అంటున్నారు. ఇదిలా ఉంటే నేడు జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి కూడా జగన్ ఢిల్లీ నుంచే పాల్గొననున్నారు.