ఏపీ, తెలంగాణ ఆర్టీసీ అధికారుల మధ్య నేడు చర్చలు..!

Tuesday, September 15th, 2020, 08:26:32 AM IST

కరోనా కార్నణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నిలిచిపోయిన బస్సు సర్వీసులను పునరుద్ధరించేందుకు ఇరురాష్ట్రాల ఆర్టీసీ అధికారులు నేడు మరోసారి సమావేశం కానున్నారు. ఇప్పటికే రెండుసార్లు భేటీ అయి చర్చలు జరిపినప్పటికీ అంతర్రాష్ట్ర ఒప్పందంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇరు రాష్ట్రాల అధికారులు నేడు మరోసారి భేటీ అయ్యేందుకు రెడీ అయ్యారు.

అయితే తెలంగాణలో ఏపీఎస్‌ ఆర్టీసీకి చెందిన వెయ్యి బస్సులు దాదాపు 2.65 లక్షల కిలోమీటర్ల వరకు నడుస్తుంటే, ఏపీ పరిధిలో టీఎస్‌ఆర్టీసీకి చెందిన 750 బస్సులు 1.45 లక్షల కిలోమీటర్లు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాము నడుపుతున్న 2.65 కిలోమీటర్లలో 50 వేల కిలోమీటర్లు తగ్గించుకుంటామని, తెలంగాణ 50వేల కిలోమీటర్ల మేర పెంచుకుంటే రెండు రాష్ట్రాలు సమానంగా నడిపినట్టు ఉంటుందని ఏపీ అధికారులు ప్రతిపాదించినా టీఎస్‌ అధికారులు మాత్రం ప్రస్తుతం ఉన్న మేరకే తాము నడుపుతామని, ఏపీ కూడా అన్ని కిలో మీటర్లే నడుపుకోవాలని సూచించింది. అయితే గత ఆరు నెలలుగా ఇరు రాష్ట్రాల మధ్య బస్సులు నడవకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే నేడు జరిగే సమావేశంలో ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చలు కొలిక్కి వచ్చి సర్వీసులు ప్రారంభం అవుతాయని ప్రయాణికులు ఆశిస్తున్నారు.