భారత్‌లో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా.. రోజు రోజుకు పెరుగుతున్న కేసులు..!

Saturday, March 13th, 2021, 01:31:19 PM IST

భారత్‌లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంబిస్తుంది. దేశ వ్యాప్తంగా కరోనాకు టీకా అందుబాటులోకి రావడంతో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో రోజు రోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతుంది. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చేలా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 24,882 కరోనా కేసులు నమోదు కాగా, 140 మంది కరోనా బారిన పడి మరణించారు.

అయితే దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,13,33,728కి చేరింది. ప్రస్తుతం అందులో 2,02,022 యాక్టివ్ కేసులు ఉండగా, 1,09,73,260 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటివరకు మొత్తం 1,58,446 మంది కరోనా బారిన పడి చనిపోయారు. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో దేశంలో మొత్తం 19,957 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 96.8 శాతం ఉండగా, మరణాల రేటు 1.4 శాతంగా ఉన్నట్టు తెలుస్తుంది.