ఆ దేశంలో ఇప్పటి వరకు మూడు లక్షలకు పైగా మరణాలు!

Thursday, March 25th, 2021, 12:42:03 PM IST

ప్రపంచ దేశాలు కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకి వణికిపోతున్నాయి. అయితే అందరికంటే ఎక్కువగా బ్రెజిల్ కరోనా వైరస్ ను కట్టడి చేయడం లో విఫలం అవుతూ వస్తోంది. అక్కడ రోజుకి వేల సంఖ్యలో మరణాలు నమోదు అవుతుండటం పట్ల వైద్య ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడి ప్రభుత్వం తీరు పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. గడిచిన 24 గంటల్లో అక్కడ రెండు వేల మందికి పైగా కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం నాడు అత్యధికంగా 3,251 మంది కరోనా వైరస్ కి బలి అయ్యారు. అయితే రోజుకి సగటున అక్కడ 2,273 మంది కరోనా వైరస్ కి బలి అవుతున్నారు.

బ్రెజిల్ లో కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ఇప్పటి వరకూ అక్కడ 3 లక్షల మంది కి పైగా కరోనా వైరస్ సోకి ప్రాణాలను కోల్పోయారు. వైరస్ ప్రారంభం అయినప్పటి నుండి ఇప్పటి వరకూ మొత్తం 3,00,685 మంది కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలు కోల్పోయారు.అయితే కేవలం 75 రోజుల్లో లక్ష మంది ప్రాణాలను కోల్పోయినట్లు అక్కడి మీడియా వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రపంచం లోనే ఎక్కువగా కరోనా వైరస్ మరణాలు నమోదు అయింది అమెరికా లోనే. ఇప్పటి వరకూ ఐదు లక్షల మందికి పైగా కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలు కోల్పోయారు. తర్వాత రెండవ స్థానం లో బ్రెజిల్ ఉండటం గమనార్హం. మరి తాజాగా మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో చూడాలి.