కరోనా సోకినా బస్సు ప్రయాణం చేసిన ఆ ముగ్గురు…తెలంగాణ రాష్ట్రం లో కలకలం!

Sunday, July 5th, 2020, 11:03:55 AM IST

తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటికే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజుకి వెయ్యి కి పైగా నమోదు అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సైతం కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు పెంచుకుంటూ పోతుంది. అయితే నిన్న శనివారం నాడు జరిగిన ఘటన రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. శనివారం మధ్యాహ్నం మూడు గంటల సమయం లో సికందరబాద్ వద్ద ఉన్న జేబియస్ నుండి అదిలాబాద్ కి ముగ్గురు ప్రయాణికులు TS08Z 0229 బస్సులో ప్రయాణించారు. అయితే శనివారం రాత్రి 11 గంటల సమయం లో అదిలాబాద్ కి చేరుకోగా, అక్కడి రిమ్స్ వద్దకు వెళ్లి తమను ఆసుపత్రిలో చేర్చుకోవాలి అని అక్కడి వైద్యులను కోరారు.

తమకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది అని, చికిత్స పొందేందుకు ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. అయితే వైద్యులు పరిస్తితి ఆరా తీయగా, వారు బస్సు లో ప్రయాణం చేసినట్లు తెలిపారు. అంతేకాక నిర్మల్ నుండి హైదరాబాద్ కి చేరి, అక్కడ కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించుకున్నారు. అయితే పాజిటివ్ వచ్చినా కూడా ప్రయాణం చేయడం పట్ల వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ బస్సులో ప్రయాణించిన వారు వెంటనే కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలి అని కోరారు.