నేటిఏపి విశ్లేషణ : ‘వైసీపీ’కి హై ఓల్టేజ్ షాక్ ఎందుకిచ్చారు?

Friday, May 16th, 2014, 07:50:10 PM IST

సీమాంధ్ర ఓటర్లు స్పష్టమైన తీర్పిచ్చారు. టీడీపీ సైకిల్ స్పీడ్ ముందు వైసీపీ ఫ్యాన్ గాలి వెల వెల పోయింది. మెజారిటీ స్థానాలు టీడీపీ కైవసం అయ్యాయి. చంద్రబాబే మా నేత అని ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీని ప్రతిపక్షంలో కూర్చొబెట్టారు. ఇందుకు కారణాలేంటి? సీమాంధ్ర ఓటర్లు టీడీపీనే ఎందుకు ఎంచుకున్నారు? వైసీపీని ఎందుకు పక్కన పెట్టారు? ఇవే ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

సీమాంధ్ర ఓటర్ల తీర్పుతో వైసీపీ నేతల మైండ్ బ్లాంక్ అయింది. ఐదు సంతకాలు చేసి.. మీ తల రాతలు మారుస్తానని వైసీపీ నేత జగన్ హామీ ఇచ్చినా ఓటర్లు నమ్మలేదు. నువ్వా.. నేనా అన్న రీతిలో జరిగిన పోటీలో టీడీపీకే అధికారం కట్టబెట్టారు. నిశ్శబ్దంగా ఓటర్లు ఇచ్చిన హై ఓల్టేజ్ షాక్ దెబ్బకి వైసీపీ ఫ్యాన్ మోటార్ కాలిపోయింది. టీడీపీ సైకిల్ స్పీడ్ ముందు ఫ్యాన్ గాలి వెలవెల పోయింది. చంద్రబాబు వ్యూహం ముందు జగన్ ప్రచారం, మైండ్ గేమ్ తుస్సుమన్నాయి. సీమాంధ్రలోని మెజారిటీ సీట్లు గెలుచుకుని టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. బాబు మాకు ఓటేయండి. మీ తల రాతలు మారుస్తామని వేడుకున్నా వైసీపీని విపక్షంలో కూర్చొబెట్టారు.

బీజేపీతో కుదిరిన ఎన్నికల పొత్తు కూడా సీమాంధ్రలో టీడీపీకి కలిసొచ్చింది. మైనారిటీ ఓట్లు పోతాయని చంద్రబాబు ఈ విషయంలో ధైర్యం చేసి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం మంచిదైంది. దీంతో మోడీ కారణంగా బీజేపీవైపు మొగ్గు చూపిన యువ ఓటర్లలో ముఖ్యంగా విద్యాధికుల్లో చాలా మంది టీడీపీకి ఓటేశారు. సీమాంధ్రలోని ప్రధాన ప్రాంతాల్లో జరిగిన మోడీ ఎన్నికల సభలు కూడా రెండు పార్టీలకు కలిసొచ్చింది. కుటుంబ కలహాలతో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ ప్రచారానికి దూరమవడం.. మొదట్లో పార్టీ పెద్దల్ని కొంత కలవర పరిచింది. అయితే సినీ హీరో పవన్ కల్యాణ్ మద్దతు తోడవడంతో ఆ లోటు తీరింది. ఆయన అభిమానుల్లో చాలా మంది బీజేపీ-టీడీపీ అభ్యర్దులకే ఓటేశారు. ఈ మార్పు కూడా సీమాంధ్రలో టీడీపీని అధికారానికి చేరువ చేసింది.

అవిభక్త రాష్ర్టంలో టీడీపీ దాదాపు పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉంది. కొత్తగా ఏర్పడుతున్న ఆంధ్రప్రదేశ్ లో అయినా అధికారం దక్కక పోతే పార్టీ ఉనికే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. దీంతో చంద్రబాబు కొత్త సామాజిక సమీకరణాలకు తెరతీశారు. తాను సీఎం అయినా.. జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలు, కాపు కులస్థులను ఉప ముఖ్యమంత్రులను ఉప ముఖ్యమంత్రులు చేస్తామన్న హామీ బాగా పని చేసింది. దీంతో ఈ వర్గాలకు చెందిన ఓటర్లలో ఎక్కువ మంది టీడీపీవైపే మొగ్గు చూపారు. ఓసీ కేటగిరిలో ఉన్న కాపుల విద్యావకాశాల కోసం వెయ్యి కోట్ల రూపాయల ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తానన్న చంద్రబాబు హామీ కూడా బాగా వర్కవుట్ అయింది.

రాష్ర్ట విభజన జరిగిన తీరుతో సీమాంధ్ర ప్రజల్లో తీవ్ర నిరాశ నిస్పృహలు నెలకొన్నాయి. ముఖ్యంగా హైదారాబాద్ మహానగరం తెలంగాణకు పోవడం ఖంగుతినిపించింది. దీంతో విద్యావంతుల్లో.. హైదరాద్ లో ఇక తమకు ఉద్యోగ అవకాశాలు ఉండవనే బెంగ మొదలైంది. సీమాంధ్రుల్లో నెలకొన్న ఈ భయాన్ని టీడీపీ బాగా ఉపయోగించుకుంది. తమకు అధికారం ఇస్తే కాబోయే సీమాంధ్ర రాజధానిని సింగపూర్ ను తలదన్నేలా తీర్చిదిద్దుతామన్న చంద్రబాబు ప్రచారాన్ని చాలా మంది నమ్మారు. ఈ విషయంలో ఏమాత్రం పాలనానుభవం లేని జగన్ కంటే.. తొమ్మిదేళ్ల పాలనానుభవం ఉన్న చంద్రబాబు అయితేనే బాగుంటుందని భావించి ఓట్లేశారు.

జగన్ తో పోలిస్తే జాతీయ రాజకీయాల్లో చంద్రబాబుకే పరిచయాలు ఎక్కువ. అవినీతి కుంభకోణాలతో అల్లాడుతున్న కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏకు ఘోర పరాజయం తప్పదని ఈ సంవత్సరం జనవరి నుంచే పోల్ సర్వేలు చెపుతున్నాయి. అప్పటి నుంచే బీజేపీ – టీడీపీ మధ్య పొత్తుకోసం చర్చలు ప్రారంభమయ్యాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాకగానీ ఈ చర్చలు ఒక కొలిక్కి రాలేదు. కేంద్రంలో అధికారం చేపట్టే బీజేపీతో ఉన్న పొత్తు కారణంగా కొత్త రాష్ర్టానికి అవసరమైన నిధుల్ని కూడా చంద్రబాబు తన పలుకుబడితో తీసుకు రాగలరని ఓటర్లు భావించి అధికారం కట్టబెట్టారని అంచనా.

వైసీపీతో పోలిస్తే సీమాంధ్రలో టీడీపీకి బలమైన కేడర్ ఉంది. కొంత మంది నేతలు వైసీపీలోకి పోయినా కింది స్థాయి క్యాడర్ మాత్రం పార్టీనే అంటిపెట్టుకుని ఉంది. అది కూడా టీడీపీకి ప్లస్ పాయింట్ అయింది. దీనికి తోడు జగన్ తో లోపాయికారి ఒప్పందం కుదిరిన తర్వాతే కాంగ్రెస్ రాష్ర్ట విభజనకు పూనుకుందన్న ప్రచారం కూడా టీడీపీకి కలిసొచ్చింది. విభజనకు కాంగ్రెస్ పార్టీ నేరుగా కారణమైతే.. వైసీపీ కూడా పరోక్షంగా అందుకు సహకరించిందని సీమాంధ్ర ప్రజలు నమ్మారు. ఆ కోపాన్ని ఓట్ల రూపంలో చూపారు. ఈ కోపం వలన సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ చావు దెబ్బతింది. ఈ కారణాలన్నీ సీమాంధ్రలో టీడీపీని అధికారానికి చేరువ చేశాయి.