ఇంకా తేలని లెక్క

Wednesday, September 24th, 2014, 04:26:05 PM IST


మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపి శివసేనల మధ్య పొత్తు పొడిచింది. ఇక వారు అభ్యర్ధుల ఎంపిక హడావుడిలో పడిపోయారు. నామినేషన్ కు సెప్టెంబర్ 27 చివరితేదీ కావడంతో అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రతిపక్షంలో కూర్చున్న బీజేపిశివసేన కూటమి.. ఈ ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని మహారాష్ట్రని హస్తగతం చేసుకోవాలని ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

ఇక మహారాష్ట్రలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తన మిత్రపక్షమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో ఇంకా పొత్తుల గురించే చర్చిస్తున్నది. సీట్ల పంపకాలలో స్వీట్స్ పంచుకోవాలా లేక హాట్ పంచుకోవాలా అని హాట్ హాట్ గా చర్చలు జరుపుతున్నాయి. ఒకవైపు ఎన్నికల సమయం సమీపిస్తుండటం.. మరోవైపు నామినేషన్ దాఖలుకు మరో మూడు రోజులే గడువు ఉండటం.. ఇంకో వైపు పొత్తుల విషయం ఇంకా ఒక కొలిక్కి రాకపోవడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనోప్పిగానే మారింది.

శివసేన మెలిక పెట్టినట్టుగానే, ఇప్పుడు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మెలికపెడుతున్నట్టు తెలుస్తున్నది. ఒకవేళ.. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. సెట్లు పంచుకున్నట్లే..అధికారం కూడా పంచుకోవాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరత్ పవార్ కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు. ఇందుకు కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించనట్టు తెలుస్తున్నది. అధికారం పంచుకుంటామంటేనే.. పొత్తు ఉంటుందనే సంకేతాన్ని శరత్ పవార్ పంపినట్టు తెలుస్తున్నది.