ఏపీ తెలంగాణ సరిహద్దు వద్ద అంబులెన్స్ లను నిలిపి వేసిన పోలీసులు

Friday, May 14th, 2021, 09:45:00 AM IST

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరుగుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు, మరణాల తో ఆసుపత్రుల్లో పడకలు దొరకడం పలు చోట్ల కష్టతరంగా మారింది. అంతేకాక తెలంగాణ రాష్ట్రం లో పడకలు దొరక్క అంబులెన్స్ లలో గంటల కొద్దీ ఎదురు చూస్తున్న వారి సంఖ్య పెరుగుతూ ఉండటం తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాల నుండి వైద్యం కోసం వచ్చే వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. ఇక పై ఇతర రాష్ట్రాల నుండి హైదరాబాద్ కు చికిత్స కోసం వచ్చే కరోనా వైరస్ బాధితులకు ముందస్తు అనుమతి తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాక బాధితుల సౌలభ్యం కోసం కాల్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగింది. 040-2465119 మరియు 9494438351 నెంబర్లను సంప్రదించవచ్చు అని తెలిపింది.

అయితే ఈ నేపథ్యం లో ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ బోర్డర్ దగ్గర ఆంక్షలు నేటి ఉదయం నుండి మొదలు అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర పోలీసులు అంబులెన్స్ లని నిలిపివేశారు. కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్ వద్ద అంబులెన్స్ లను నిలిపి వేస్తున్నారు తెలంగాణ పోలీసులు.