తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులు పూర్తి..!

Wednesday, August 12th, 2020, 08:03:32 AM IST

తెలంగాణలో పాత సచివాలయ భవనం కూల్చి అదే స్థానంలో కొత్త సచివాలయ భవనం నిర్మించేందుకు కేసీఆర్ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే పాత సచివాలయ భవనం కూల్చివేత సమయంలో ఎన్నో అడ్డంకులు ఏర్పడిన చివరకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కూల్చివేత పనులు చకచకా జరిగిపోయాయి.

అయితే సచివాలయ భవనం కూల్చివేత పూర్తైనట్టు రోడ్లు, భవనాల శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ కూల్చివేత శిథిలాలను దాదాపు 80% తొలగించామని, దాదాపు లక్ష టన్నుల శిథిలాలు, ఇతర వ్యర్థాలు వెలువడినట్లు అధికారులు చెప్పారు. ప్రతి రోజు రాత్రి పూట మాత్రమే టిప్పర్లతో ఈ వ్యర్థాలను తరలించామని, వ్యర్థాల నుంచి దాదాపు 3 వేల టన్నుల స్టీల్, ఇతర వ్యర్థాలను స్క్రాప్ కింద అమ్మడం ద్వారా 6 కోట్ల ఆదాయం వస్తుందన్నారు.
ఇదిలా ఉంటే ఇటీవల కొత్త సచివాలయ డిజైన్‌ని కూడా సీఎం కేసీఆర్‌తో పాటు కేబినెట్ కూడా ఆమోదించడంతో నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.