తెలంగాణ కూడా మహారాష్ట్రలా మారే ప్రమాదం ఉంది.. హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు హెచ్చరిక..!

Thursday, April 15th, 2021, 12:29:02 AM IST

కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం మరింత అప్రమత్తమయ్యింది. ఈ క్రమంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో నాలుగు వారాలుగా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని, మరో ఆరు వారాలు ఇదే పరిస్థితి ఉంటుందని అన్నారు. ప్రజలు వైరస్‌ను నిర్లక్ష్యం చేస్తే తెలంగాణ కూడా మరో మహారాష్ట్రలా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

అయితే ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు రాకూడదనే లాక్‌డౌన్ విధించడం లేదని, అందుకే ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని అన్నారు. ఇప్పుడు ఉన్న వైరస్ చాలా త్వరగా వ్యాప్తి చెందుతుందని ఇంట్లో ఒకరికి కరోనా ఉంటే గంటలోపే మిగతా వారికి వ్యాప్తి చెందుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, అత్యవసరం అయితేనే ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలని శ్రీనివాసరావు సూచించారు.