గాలి నుంచి వ్యాపించే ద‌శ‌కు క‌రోనా చేరుకుంది.. హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ హెచ్చరిక..!

Sunday, April 18th, 2021, 03:00:07 AM IST

కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు రాష్ట్రంలో తీవ్రంగా ఉన్నాయని తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. కరోనా తొలిదశ నుంచి ప్రజలు ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని, అజాగ్రత్తగా వ్యవహరిస్తున్న కారణంగానే ఎక్కువ మంది కరోనా బారిన పడుతున్నారని అన్నారు. ప్రపంచంలోని అగ్ర దేశాలు సైతం కరోనా ముందు మోకరిల్లుతున్నాయని ప్రజలు ఇకనైనా నిర్లక్ష్యాన్ని వీడాలని అన్నారు. అయితే గాలి నుంచి వ్యాపించే ద‌శ‌కు క‌రోనా చేరుకుంద‌ని రాబోయే రెండు నెలలు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

అయితే ప్రతి రోజు లక్ష మందికి పైగా టెస్టులు చేస్తున్నామని, 15 రోజుల్లో పాజిటివ్ రేటు రెట్టింపు అయ్యిందని అన్నారు. కొత్త మ్యుటేష‌న్ల కార‌ణంగా క‌రోనా వేగంగా వ్యాపిస్తుందని మార్చ్ 24న తెలంగాణలోని బార్డర్ జిల్లాకి మహారాష్ట్ర నుంచి 20 మంది ఫెస్టివల్ కోసం వచ్చారని, వారికి మరో 30 మంది తెలంగాణ వాళ్లు జత కలిశారని ఈ నెల 4వ తేదిన వారికి టెస్టులు చేయగా 34 మందికి కరోనా వచ్చిందని, ఈ ఘటనలో 430 మందికి కరోనా సోకిందని రాష్ట్రంలో ఇదే అతి పెద్ద ఔట్ బ్రేక్ అని అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్స్, మందుల కొరత లేదని ప్రజలెవరూ భయపడాల్సిన పని లేదని అన్నారు.