ఆంధ్రావాళ్ళపై ఈగ వాలనివ్వలేదు.. సంక్రాంతికి ఇళ్ళకు వెళ్లి వచ్చాకే!

Thursday, December 31st, 2015, 08:32:47 PM IST


తెలంగాణా పంచాయితీ, ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ తాజాగా తెలంగాణా భవన్ లో మీడియాతో మాట్లాడుతూ పేదవాళ్ళు ఏ ప్రాంతం వాళ్లైనా తమకు ఒక్కటేనని స్పష్టం చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ఈ పద్దెనిమిది నెలల్లో ఏ ఒక్క ఆంధ్రావారిపై ఈగ వాలనివ్వలేదని, ఆంధ్రావాళ్ళను ఇక్కడ నుంచి పంపించేస్తారని ప్రచారం చేశారని’ అన్నారు. అంతేకాకుండా హైదరాబాద్ లోని సీమాంధ్రా వారిలో ఏ ఒక్కరికైనా నష్టం జరిగిందా? అని, సంక్షేమ పథకాల అమల్లో పక్షపాతం చూపించామా? అని కేటీఆర్ ప్రశ్నించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ ఇంకా మాట్లాడుతూ.. ‘ఆంధ్రావాళ్ళు సంక్రాంతికి ఇళ్ళకు వెళ్లి వచ్చాకే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయని, వారి ఓట్ల తోనే జీహెచ్ఎంసీ పీఠాన్ని కైవసం చేసుకుంటామని’ తెలిపారు. అలాగే గ్రేటర్ ఎన్నికల్లో పొత్తులు లేవని, ఒంటరిగానే పోటీ చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. అంతేకాకుండా రిజర్వేషన్స్ ప్రకటన తర్వాత గెలుపు గుర్రాలకే టిక్కెట్లు అని, 75 శాతం సీట్లు మహిళలకు ఇస్తామని, సామాజిక న్యాయం పాటిస్తామని తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఇంకా మాట్లాడిన కేటీఆర్ సీఎం కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూ.. ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.