అంబేడ్కర్ ను అవమానించింది కాంగ్రెస్ పార్టీ కాదా? – కేటీఆర్

Thursday, September 17th, 2020, 02:29:06 AM IST


తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ తీరు పై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను కాంగ్రెస్ పార్టీ అవమానించింది అంటూ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే నగర, పట్టణాల్లో అభివృద్ది పనులు మరియు మౌలిక సదుపాయాల పై చర్చలో బాగంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే తమకు అంబేడ్కర్ పై గౌరవం లేదు అను భట్టి విక్రమార్క మాట్లాడటం, అది వారికే చెల్లుతుంది అంటూ మండి పడ్డారు. అయితే అంబేడ్కర్ ను అవమాన పరిచింది కాంగ్రెస్ పార్టీ కాదా అని మంత్రి కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు.

అయితే 1952 లో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంబేడ్కర్ ను ఓడించింది అని గుర్తు చేశారు. అంబేడ్కర్ ను పార్లమెంట్ లో అడుగు పెట్టనివ్వకుండా కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసింది అని అన్నారు. అంబేడ్కర్ కి భారత రత్న ఇవ్వని నేతలు, ఆయన గురించి మాట్లాడటం విడ్డూరం అంటూ ఎద్దేవా చేశారు.అయితే అంబేడ్కర్ ను గౌరవిస్తున్నాం కాబట్టే, బొరబండ లో సెంటర్ ఫర్ దళిత స్టడీస్ వద్ద దేశం లోనే అతిపెద్ద విగ్రహాన్ని 28 అడుగుల ఎత్తులో పెట్టామనీ తెలిపారు. అంతేకాక ట్యాంక్ బండ్ వద్ద 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీ అంబేడ్కర్ ఆశయాలను అనుసరించి ఉంటే ఎప్పుడో బాగుపడేది అని, తమ పార్టీ అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తోంది అని తెలిపారు.