తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటలకు ఆ చట్టం గురుంచి తెలియదా?

Saturday, March 27th, 2021, 03:06:46 AM IST


తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేస్తూ ప్రైవేట్ ఆస్పత్రులు నిర్వహించే వైద్యులను విధుల నుంచి తొలగిస్తేనే సిబ్బంది కొరత సమస్య పరిష్కారమవుతుందని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రభుత్వ వైద్యులు చాలా మంది ప్రైవేట్ ఆస్పత్రులు నిర్వహిస్తున్నారని, అలాంటి వారిని విధుల నుంచి తొలగిస్తామని మంత్రి ఈటల హెచ్చరించిన సంగతి తెలిసిందే. అంతేకాదు వారి స్థానంలో కొత్తవారిని నియమిస్తామని కూడా చెప్పుకొచ్చారు.

అయితే మంత్రి ఈటల వ్యాఖ్యలను తెలంగాణ మెడికల్ జేఏసీ తప్పుపట్టింది. ప్రభుత్వ వైద్యులు.. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పనిచేసుకోవచ్చని ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక జీవో ఇప్పించారని తెలంగాణ ప్రభుత్వ మెడికల్ జేఏసీ చైర్మన్ డా. రమేష్ గుర్తు చేశారు. ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్‌లో వైద్యం చేస్తున్నారని అలా చేస్తున్న వారిని తొలగిస్తామంటూ మంత్రి ఈటల చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జీవోకు విరుద్ధంగా మంత్రి ఈటల మాట్లాడటం సరికాదని అన్నారు.