కరోనా కొత్త రకం స్ట్రెయిన్‌ వైరస్.. మరింత అప్రమత్తమైన తెలంగాణ వైద్యశాఖ..!

Tuesday, December 22nd, 2020, 01:30:10 AM IST

కరోనా కొత్త రకం స్ట్రెయిన్‌ వైరస్ నేపథ్యంలో తెలంగాణ వైద్యారోగ్య శాఖ మరింత అప్రమత్తమయ్యింది. గత వారం రోజుల్లో యూకే నుంచి వచ్చిన వారి వివరాలను ట్రాక్ చేయబోతున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కరోనా సర్వేలెన్సు ఏర్పాటు చేసి అక్కడే ఆర్టీ పీసీఆర్ టెస్టులు చేయడానికి కూడా ఏర్పాట్లు చేసింది. అయితే ఈ ఫలితంలో పాజిటివ్ వచ్చిన వారిని ఆస్పత్రికి, నెగెటివ్‌ వచ్చిన వారిని వారం రోజుల పాటు క్వారంటైన్‌కు పంపుతున్నట్టు సమాచారం.

ఇదిలా ఉంటే కరోనా కొత్త రకం స్ట్రెయిన్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ వ్యాప్తి దృష్ట్యా బ్రిటన్‌ నుంచి వచ్చే అన్ని విమానాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. రేపు రాత్రి నుంచి ఈ నెల 31 వరకు బ్రిటన్‌కు విమానాలు లేవని, బ్రిటన్‌ మీదుగా భారత్‌కు వచ్చే వారిపై ఆంక్షలు విధిస్తూ వారు తప్పనిసరిగా ఆర్టీ పీసీఆర్‌ పరీక్షలు చేయించుకోవాలని ఆదేశించింది.