గ్రేటర్ ఎన్నికలు ఆపాలంటూ పిటీషన్.. సాధ్యం కాదని తేల్చేసిన హైకోర్టు..!

Wednesday, November 25th, 2020, 05:35:12 PM IST

ఓ పక్క గ్రేటర్ ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకుంది. మరో పక్క అన్ని పార్టీల నేతలు బస్తీలలో తిరుగుతూ తమకు ఓటేయాలంటూ నగరవాసులను వేడుకుంటున్నారు. గ్రేటర్ ఎన్నికలకు ఇక ఐదు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇలాంటి సమయంలో గ్రేటర్ ఎన్నికలను ఆపాలంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలయ్యింది. మున్సిపల్ యాక్ట్ ప్రకారంగా మేయర్, కార్పోరేటర్ల రిజర్వేషన్లు సక్రమంగా జరగలేదని అడ్వొకేట్ రచనా రెడ్డి పిల్ దాఖలు చేశారు.

అయితే ఈ పిటీషన్‌ను నేడు విచారించిన హైకోర్టు మరో వారంలో ఎన్నికలు జరగనున్నందున ఇప్పుడు తాము ఏలాంటి ఆదేశాలు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఎన్నికలపై దాఖలైన పిల్స్, రిట్ పిటీషన్‌లను అన్ని కలిపి డిసెంబర్ 23న విచారిస్తామని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణను డిసెంబర్ 23కు వాయిదా వేసింది. కాగా డిసెంబర్ 1న గ్రేటర్ ఎన్నికలకు పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 4న ఫలితాలు వెల్లడవ్వనున్నాయి.