రీపోలింగ్ నిర్వహించండి.. ఎన్నికల కమీషన్‌కు హైకోర్టు కీలక సూచనలు..!

Thursday, December 3rd, 2020, 11:30:56 PM IST

గ్రేటర్ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో తేలబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ ఎక్కువ సీట్లను గెలుచుకుంటుంది, మేయర్ పీఠాన్ని ఏ పార్టీ దక్కించుకోబోతుంది అన్న ఉత్కంఠ అందరిలో కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ఎన్నికల కమీషన్‌కు కీలక సూచన చేసింది. పలు డివిజన్లలో రీ పోలింగ్ చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించింది.

అయితే ఘాన్సీ జజార్, పురానాపూల్ డివిజన్లలో రీపోలింగ్ నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని సూచనలు చేసింది. ఈ డివిజన్లలో రీపోలింగ్ నిర్వహించాలని అక్కడి నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడమే కాకుండా, ఎన్నికల కమిషన్ అధికారులను కలిసి వినతి పత్రం కూడా అందించారు. అయితే రేపే ఎన్నికల కౌంటింగ్ ఉండడంతో హైకోర్టు సూచనలపై ఎస్ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఒక వేళ కోర్టు సూచనలను ఎస్ఈసీ పరిగణలోకి తీసుకుని రీ పొలింగ్ నిర్వహించాలని భావిస్తే కౌంటింగ్ ఆపే అవకాశం కనిపిస్తుంది.