కరోన పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి – తెలంగాణ హెల్త్ డైరెక్టర్

Wednesday, November 4th, 2020, 03:22:23 PM IST

కరోనా పట్ల ప్రజలు ఇకపై మరింత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు సూచించారు. ఇక నుంచి పెద్ద పండుగలు రాబోతున్నాయని కరోనా తగ్గిపోయిందని ఎవరూ అజాగ్రత్తగా వ్యవహరించకండని అన్నారు. కేసుల సంఖ్య పెరగకుండా ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, వైద్య ఆరోగ్య శాఖ కోవిడ్‌పై పోరాటం చేస్తోందని చెప్పుకొచ్చారు. చలికాలంలో కరోనాతో పాటు ఇతర వైరస్‌లు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని అన్నారు.

అయితే కరోనాకు వ్యాక్సిన్ రావడానికి ఇంకా సమయం పడుతుందని అప్పటి వరకు ప్రతి ఒక్కరు మాస్క్ తప్పనిసరిగా వాడాలని సూచించారు. గత రెండు నెలలుగా తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు బాగా తగ్గాయని అన్నారు. మొదటిసారి కరోనా వచ్చిన వారు ఎక్కువగా బహిరంగ ప్రదేశాల్లో తిరగవద్దని అన్నారు. అయితే కరోనా కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.