ఆ ఉద్యోగులు వెనక్కి.. ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ సర్కార్ లేఖ..!

Tuesday, March 16th, 2021, 11:12:23 PM IST

ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులను వెనక్కి రప్పించేందుకు ప్రభుత్వం స్పీడ్ పెంచింది. ఈ మేరకు ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ లేఖ రాశారు. దీనిపై ఏపీ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. అయితే తాజాగా ఏపీ పరిపాలనా విభాగం ముఖ్యకార్యదర్శి ప్రేమ్ చంద్రారెడ్డికి తెలంగాణ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు లేఖ రాశారు.

అయితే ఉద్యోగుల విభజన సమయంలో తెలంగాణకు ఆప్షన్ ఇచ్చి ఏపీకి అలాట్ అయిన ఉద్యోగులను రాష్ట్రానికి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో ఎక్కడైనా పనిచేసేందుకు సిద్ధమంటూ సర్వీస్ ర్యాంక్ చివర్లో చేరేందుకు ఒప్పుకొని అండర్‌టేకింగ్ ఇచ్చే ఉద్యోగులను రిలీవ్ చేయాలని కోరింది. అయితే డ్రైవర్లు, రికార్డు అసిస్టెంట్లు, లిఫ్ట్ ఆపరేటర్లు, క్యాషియర్లు వంటి క్లాస్ 3 ఉద్యోగులు, అటెండర్లు, వాచ్ మెన్లు, జమేదార్, మెసెంజర్స్ మొదలగు క్లాస్ 4 ఉద్యోగులు కలిపి 698 మంది ఉద్యోగులను వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్దమయ్యింది.