తెలంగాణ లాక్‌డౌన్ మార్గదర్శకాలు రిలీజ్.. మినహాయింపు దేని దేనికంటే?

Tuesday, May 11th, 2021, 09:31:05 PM IST

Hyderabad_lockdown

తెలంగాణలో రేపటి నుంచి పది రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కేవలం 4 గంటలపాటు మాత్రమే అన్నిరకాల షాపులు తెరిచి ఉంటాయి. మిగతా 20 గంటలపాటు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ అమల్లో ఉంటుంది. అయితే తాజాగా లాక్‌డౌన్‌కి సంబంధించి మినహాయింపులపై ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను రిలీజ్ చేసింది.

లాక్‌డౌన్ మార్గదర్శకాలు:

* వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులు, అనుబంధ రంగాలు, వ్యవసాయ యంత్రాల పనులు, రైస్ మిల్లుల నిర్వహణ, సంబంధిత రవాణా, ఎఫ్.సి.ఐ.కి ధాన్యం పంపడం, ఫెర్టిలైజర్, సీడ్ షాపులు, విత్తన తయారీ కర్మాగారాలు తదితర అన్నిరకాల వ్యవసాయ రంగాలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు.
* రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లను యథావిధిగా కొనసాగించాలి.
* వైద్య రంగంలో ఫార్మాసూటికల్ కంపెనీలు, వైద్య పరికరాల తయారీ కంపెనీలు, మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ షాపులు, అన్నిరకాల వైద్య సేవలు, ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు, వారి వారి ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక పాసులిచ్చి వాహనాలకు అనుమతి
* విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలు, వాటి అనుబంధ కార్యకలాపాలు యధావిధిగా పనిచేస్తాయి.
* జాతీయ రహదారుల మీద రవాణా యధావిధిగా కొనసాగుతుంది. మరియు పెట్రోల్, డీజిల్ పంపులు నిరంతరం తెరిచే ఉంటాయి.
* గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ యధావిధిగా సాగుతుంది.
* విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలు, వాటి అనుబంధ కార్యకలాపాలు యధావిధిగా పనిచేస్తాయి.
* కోల్డ్ స్టోరేజీ, వేర్ హౌసింగ్ కార్యకలాపాలకు మినహాయింపు
* ఉపాధిహామీ పనులు యధావిధిగా కొనసాగుతాయి.
* ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు మినహాయింపు
* బ్యాంకులు, ఏటీఎంలు యధావిధిగా పనిచేస్తాయి.
* అన్ని ప్రభుత్వ కార్యాలయాలు 33 శాతం సిబ్బందితో పనిచేస్తాయి.
* పెండ్లిళ్లకు 40 మందికి, అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతి.
* ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్నిరకాల మెట్రో, ఆర్టీసీ ప్రజా రవాణా అందుబాటులో ఉండగా, అంతరాష్ట్ర బస్సులు మాత్రం నడవవు.
* గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ సరఫరా యధావిధిగా కొనసాగుతుంది.
* ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు రేషన్ షాపులు తెరిచే ఉంటాయి.
* సినిమాహాళ్లు, క్లబ్బులు, జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్, అమ్యూజ్ మెంట్ పార్కులు, స్పోర్ట్స్ స్టేడియంలు పూర్తిగా మూసివేత.