తెలంగాణలో విద్యాసంస్థల రీ ఓపెనింగ్‌పై మార్గదర్శకాలివే..!

Wednesday, January 13th, 2021, 03:00:03 AM IST

కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది మార్చి నుంచి దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం కరోనా ప్రభావం కాస్త తగ్గడంతో కొన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ కూడా నిన్న స్కూళ్ల పున:ప్రారంభంపై కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1వ తేది నుంచి స్కూళ్లు తెరిచేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కేవలం 9వ తరగతి ఆపై తరగతులను నిర్వహించడానికి మాత్రమే అనుమతులు ఇచ్చింది.

అయితే తాజాగా విద్యాసంస్థల రీ ఓపెనింగ్‌పై తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. 9, 10 తరగతులు రెగ్యులర్‌ స్కూల్‌ సమయాల్లోనే తరగతులు నిర్వహించాలని, క్లాస్‌కు 20 మంది కన్నా ఎక్కువ మంది విద్యార్థులు ఉండకూడదని, విద్యార్థికి, విద్యార్థికి మధ్య 6 అడుగుల దూరం తప్పనిసరిగా ఉండాలని తెలిపింది. ఇక ఇంటర్ క్లాసులు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5:30 వరకు జరపాలని, స్టూడెంట్స్ 300 కన్నా ఎక్కువ ఉంటే 2 షిప్టులు చేయాలని ఆదేశాల్లో తెలిపింది. ఇదిలా ఉంటే అటెండెన్స్ లేదని విద్యార్థులను పరీక్షలకు అనుమతి నిరాకరించవద్దని తెలిపింది.