తెలంగాణలో థియేటర్లు తెరుచుకునేందుకు గ్రీన్‌సిగ్నల్..!

Wednesday, November 18th, 2020, 01:05:56 AM IST


అన్‌లాక్‌లో భాగంగా 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ ఓపెన్ చేసుకునేందుకు కేంద్రం ఇదివరకే పర్మీషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే పలు రాష్ట్రాల్లో థియేటర్లు తెరిచినా కొత్త సినిమాలు లేకపోవడం, జనాలు థియేటర్లకు వచ్చేందుకు సాహసం చేయకపోవడంతో ఎగ్జిబీటర్లు మళ్లీ థియేటర్లను మూసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులు ఓ పక్క ఉంటే మరో పక్క తెలంగాణలో థియేటర్స్ తెరుచుకోడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

50 శాతం ఆక్యుపెన్సీతో మల్టీప్లెక్సులు, థియేటర్స్ ఓపెన్ చేసుకోవచ్చని అనుమతులు ఇచ్చింది. సరైన జాగ్రత్తలు తీసుకుని థియేటర్స్ ఓపెన్ చేసుకోండని ప్రభుత్వం నుంచి అధికారిక లేఖ విడుదలయ్యింది. అయితే దీనిపై దర్శక నిర్మాతల నుంచి మాత్రం సానుకూల స్పందన రావడం లేదు. ప్రస్తుత పరిస్థుతులలో తమ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తే చూసేందుకు జనాలు వస్తారా? లేదా అనేది వారిని తీవ్రంగా కలవరపెడుతుంది. దీంతో ఎగ్జిబీటర్లు కూడా ఆలోచనలో పడిపోయారు. అయితే దర్శక నిర్మాతలు, ఎగ్జిబీటర్లు భయాన్ని వీడి ధైర్యంగా ముందడుగువేస్తే కనుక డిసెంబర్ 1 నుంచి తెలంగాణలో కూడా థియేటర్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే డిసెంబర్‌లో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను థియేటర్‌లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించగా, ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు కూడా రిలీజ్ అయ్యేందుకు సిద్దంగా ఉన్నట్టు తెలుస్తుంది.