కొత్త రెవెన్యూ చట్టంపై కసరత్తులు చేపట్టిన తెలంగాణ సర్కార్..!

Wednesday, September 2nd, 2020, 08:30:01 AM IST

కొత్త రెవెన్యూ చట్టంపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది. భూ సమస్యల పరిష్కారం కోసం అధికారుల చుట్టూ రైతులు తిరిగే అవసరం లేకుండా, ఏ అధికారికి లంచాలు సమర్పించకుండా తేలికగా రైతుల సమస్యలు పరిష్కరించే విధానాన్ని అమలులోకి తీసుకురాబోతున్నారు. ఎన్నో అక్రమాలు, అవినీతిని మూటగట్టుకున్న రెవెన్యూశాఖను ప్రక్షాళనుచేయాలని ఇది వరకే సీఎం కేసీఆర్ నిర్ణయించడంతో కొత్త రెవెన్యూ చట్టంపై ప్రభుత్వం కసరత్తులు చేపట్టింది.

అయితే రెవెన్యూ చట్టంలో ప్రస్తుతమున్న 144 చట్టాలు లేదా నియమాల్లో కాలం చెల్లినవాటిని తొలగించి కేవలం 20 చట్టాలను క్రోడీకరిస్తూ కొత్త చట్టం రూపొందించనున్నారు. రిటైర్డ్ ‌ ఐఏఎస్‌ అధికారులు శివశంకర్, బలరామయ్య, రంగారెడ్డి జిల్లా మాజీ జేసీ సుందర్‌ అబ్నార్‌ తదితర రెవెన్యూ, న్యాయ నిపుణులతో కూడిన కమిటీ కొత్త చట్టం రూపకల్పనకు కసరత్తులు చేస్తుంది. ఇకపై 45 రోజుల్లో భూసమస్యలు పరిష్కారం కాకపోతే అర్జీని నేరుగా కలెక్టర్‌కు పంపాలని అక్కడ తేలకపోతే జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే ట్రిబ్యునల్‌కు నివేదిస్తారు. ఇక్కడ తీర్పు సరిగ్గా లేకుంటే రెవెన్యూ కోర్టుకు అప్పీల్‌ చేసుకునేలా కొత్త విధానం తీసుకురాబోతున్నారు. ఇదిలా ఉంటే కొత్త రెవెన్యూ చట్టంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుండడంతో సమస్య పరిష్కారం అయ్యే వరకు స్టేటస్ రిపోర్టును ఆన్‌లైన్‌లో చూసుకునే అవకాశం కల్పించబోతున్నారు.