మిస్ ఇండియా 2020గా నిలిచిన తెలుగమ్మాయి..!

Thursday, February 11th, 2021, 10:52:21 PM IST


మన తెలుగమ్మాయి తెలంగాణ ముద్దుగుమ్మకు మిస్ ఇండియా 2020 టైటిల్ వరించింది. వీఎల్‌సీసీ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 పోటీలో హైదరాబాద్‌ అమ్మాయి మానస వారణాసి విజేతగా నిలిచింది. ఇందులో రన్నరప్‌గా ఉత్తరప్రదేశ్‌కు చెందిన మాన్యా సింగ్, మిస్ గ్రాండ్ ఇండియా 2020గా హర్యానాకు చెందిన మానికా షియోఖండ్ నిలిచారు. మిస్ ఇండియా 2019 సుమన్ రావు మానసకు కిరీటాన్ని బహూకరించారు.

అయితే 70వ మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ తరపున మానస పాల్గొనబోతుంది. 23 ఏళ్ల మానస వారణాసి హైదరాబాద్‏లోనే పుట్టింది. గ్లోబల్ ఇండియన్ స్కూల్లో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన మానస వాసవి ఇంజినీరింగ్ కాలేజీలో ఇంజినీరింగ్ పూర్తిచేసి ప్రస్తుతం ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్‏ఛేంజ్ అనలిస్ట్‏గా పనిచేస్తోంది. పుస్తకాలు చదవడం, మ్యూజిక్ వినడం, యోగా చేయడం మానసకు అలవాటు. భరతనాట్యం, సంగీతంలో కూడా ఆమెకు మంచి పట్టున్నట్టు తెలుస్తుంది.