కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయిన సీఎం కేసీఆర్‌..!

Friday, December 11th, 2020, 10:00:14 PM IST

సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా నేడు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు అవుతున్నారు. ఈ రోజు సాయంత్రం తొలుత కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీ అయిన సీఎం కేసీఆర్ రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులు, కేంద్ర సహకారంపై దాదాపు గంటపాటు చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 3 టీఎంసీల నీరు ఎత్తిపోసేందుకు అనుమతులు ఇవ్వాలని, ప్రస్తుతం రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకే అనుమతి ఉందని అన్నారు.

అయితే తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో కూడా సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై అమిత్ షాతో చర్చించనట్లు సమాచారం. ఇటీవల తెలంగాణలో భారీ వరదలు వచ్చి పెద్ద ఎత్తున ఆస్తినష్టం వాటిల్లిన నేపథ్యంలో రాష్ట్రానికి ఆర్థికంగా సాయం అందించాలని అమిత్ షాను కోరారు. ఇక మరో మూడు రోజులపాటు ఢిల్లీలోనే ఉండనున్న సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలిసే అవకాశం ఉంది. అయితే రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్‌ ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోరడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి కూడా కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్నట్టు తెలుస్తుంది.