ఏపీ సీఎం జగన్ సాయం కోరిన కేసీఆర్.. దేనికోసమంటే?

Tuesday, October 20th, 2020, 03:01:25 AM IST


తెలుగు రాష్ట్రాలలో గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల దెబ్బ నుంచి కోలుకోకముందే మళ్ళీ వర్షాలు కురుస్తుండడం, రానున్న మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేయడంతో రెండు తెలుగు రాష్ట్రాలు ముందస్తు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాయి. అయితే ఇప్పటికే కురిసిన వర్షాలకు హైదరాబాద్‌లో చాలా లోతట్టు ప్రాంతాలు నీట మునిగి ఉన్నాయి.

అయితే మళ్ళీ వర్షాలు వచ్చి వరద పెరిగితే బాధితులను ఆదుకొని వారిని ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటుంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ జగన్ సాయం కోరారు. నగరంలో పరిస్థితి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని, వరద సహాయ పునరావాస చర్యలకై స్పీడ్ బోట్లు పంపాలని ఏపీ సీఎం జగన్‌ను అడిగారు. దీంతో వెంటనే స్పందించిన సీఎం జగన్ తెలంగాణకు స్పీడు బోట్లను పంపాలని విపత్తుల నిర్వహణ సంస్థ, పర్యాటక శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో విపత్తుల నిర్వహణ సంస్థ నుంచి మూడు, పర్యాటక శాఖ ద్వారా ఐదు కలిపి మొత్తం ఎనిమిది స్పీడు బోట్లను హైదరాబాద్‌ పంపిస్తున్నామని, ఈ స్పీడ్ బోట్లతో పాటు ఎస్డీఆర్ఎఫ్‌కు సంబంధించిన ఈతగాళ్లను, లైఫ్ జాకెట్లను కూడా పంపుతున్నట్లు అధికారులు చెప్పుకొచ్చారు.