తెలంగాణ వ్యాప్తంగా త్వరలో పాదయాత్ర – తీన్మార్ మల్లన్న

Sunday, March 28th, 2021, 11:00:53 PM IST

తీన్మార్ మల్లన్న స్వతంత్ర అభ్యర్థిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖమ్మం – నల్గొండ – వరంగల్ నియోజక వర్గం తరపున పోటీ చేసి, అధికార తెరాస అభ్యర్థి అయిన పల్లా రాజేశ్వర్ రెడ్డి కి గట్టి పోటీ ఇచ్చారు. అధికార పార్టీ కి ఒకానొక సమయంలో తీన్మార్ మల్లన్న విజయం ఖాయం అనే రీతిలో పోటి ఇచ్చారు. అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపిన తీన్మార్ మల్లన్న మేడ్చల్ ఘటకేసర్ లోని ఒక సభ లో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

త్వరలో నాగార్జున సాగర్ ఉపఎన్నిక లో పోటీ పై ఒక క్లారిటీ ఇచ్చారు మల్లన్న. ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని అన్నారు. అయితే త్వరలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6 వేల కిలమీటర్ల పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. అంతేకాక తీన్మార్ మల్లన్న పేరిట రాష్ట్ర, జిల్లా, నియోజక వర్గ, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అయితే తాను ఎలాంటి రాజకీయ పార్టీ పెట్టడం లేదు అని వ్యాఖ్యానించారు. అయితే తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది.