మరో మైనార్టీపై వైసీపీ నాయకుల కక్ష సాదింపు చర్య.. టీడీపీ మండిపాటు..!

Saturday, November 14th, 2020, 07:54:12 AM IST

వైసీపీ నాయకులు, పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఇటీవల నంద్యాలలో అబ్ధుల్ సలాం కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువకముందే మరో మైనార్టీపై వైసీపీ నాయకుల, అధికారుల కక్ష సాదింపు చర్యకు దిగారని టీడీపీ మండిపడింది. నెల్లూరు జిల్లా, కోవూరు నియోజకవర్గ, ముదిపర్తి గ్రామ టీడీపీ మైనార్టీ నాయకుడు ఇమామ్ బాషా తన అమ్మమ్మ గారి నుండి సంక్రమించిన భూమిలో కుళాయి అనుమతి, కరెంట్ అనుమతి పొంది ఇల్లు నిర్మించుకునుచుండగా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి (వైసీపీ) ప్రోద్బలంతో స్థానిక రెవెన్యూ అధికారులు ఇది ప్రభుత్వ స్థలానికి చెందినది అంటూ అడ్డు తగులుతున్నట్టు ఆరోపించింది.

అయితే ఇమామ్ బాషా ఇంటి చుట్టూ ఉన్న కాలనీ ప్రజలు మా స్థలాలు ప్రభుత్వానివి కానప్పుడు ఇమామ్ బాషా స్థలం ప్రభుత్వ స్థలం ఎలా అవుతుంది అని నిలదీయడంతో అధికారులు వెనుదిరిగారని, వైసీపీ ప్రభుత్వంలో మైనారిటీలకు రక్షణ లేకుండా పోతుంది అనడానికి ఇది మరో నిదర్శనం అని, ఇమామ్ బాషా ఇంటిని అధికారులు అక్రమంగా కూల్చడానికి ప్రయత్నిస్తే ఊరుకోబోమని తెలుగుదేశం పార్టీ హెచ్చరించింది.