ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావ్ అరెస్ట్..!

Thursday, January 21st, 2021, 01:15:49 AM IST


ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కళా వెంకట్రావును పోలీసులు అరెస్టు చేశారు. రామతీర్థంలో విగ్రహాల ధ్వంసం ఘటన సమయంలో ఆలయ పర్యటనకు వచ్చిన ఎంపీ విజయసాయిరెడ్డి కాన్వాయ్ మీద చెప్పులు విసిరిన కేసులో కళా వెంకట్రావును పోలీసులు అరెస్టు చేశారు. కళా వెంకట్రావు అనుచర వర్గమే ఈ దాడికి పాల్పడిందని, ఇందులో ఆయన హస్తం కూడా ఉందని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లా రాజాం వద్ద పోలీసులు కళా వెంకట్రావును అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఆయనను చీపురుపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఇదిలా ఉంటే రామతీర్థం ఆలయంలో విగ్రహాలను ధ్వంసం ఘటనకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు రామతీర్ధం పర్యటనకు వెళ్ళగా అదే రోజు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా రామతీర్థం పర్యటనకు వెళ్ళారు. దీంతో ఆరోజు అక్కడ వైసీపీ, టీడీపీ నేతల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ముందు చంద్రబాబు తన పర్యటనను ఖరారు చేస్తే దాన్ని రాజకీయం చేసేందుకు విజయసాయిరెడ్డి వచ్చారంటూ టీడీపీ నేతలు ఆరోపించారు. ఈక్రమంలో టీడీపీ కార్యకర్తలు విజయసాయి రెడ్డి వాహనంపై రాళ్లు, చెప్పులతో దాడికి పాల్పడ్డారు.