కరోనా బారిన పడి మృతి చెందిన టీడీపీ సీనియర్ నేత..!

Friday, September 11th, 2020, 11:58:53 AM IST

ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. సామాన్య జనంతో పాటు ఇప్పటికే చాలా మంది ప్రజాప్రతినిధులు కూడా కరోనా బారిన పడ్డారు. అయితే కరోనా బారిన పడి తాజాగా టీడీపీ సీనియర్ నేత, కాపు కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ చలమలశెట్టి రామాంజనేయులు మరణించారు. కొద్ది రోజుల క్రితం ఆయనకు కరోనా సోకగా విజయవాడలోని జీజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

అయితే గత నాలుగు రోజుల నుంచి ఆయన పరిస్థితి విషమించడంతో వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం విషమించడంతో నేడు ఉదయం మరణించారు. అయితే రామాంజనేయులు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రులు,టీడీపీ శ్రేణులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.