జాగ్రత్తగా ఉండండి.. వైసీపీనీ హెచ్చరించిన బాలకృష్ణ..!

Tuesday, February 16th, 2021, 01:12:20 AM IST


ఏపీలో పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్న నేపధ్యంలో అధికార వైసీపీకి, ప్రతిపక్ష టీడీపీకి మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. అయితే నామినేషన్లు వేయవద్దని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని, కొన్నిచోట్ల కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని టీడీపీ మద్ధతుదారులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో నేడు హిందుపూరానికి వెళ్ళిన ఎమ్మెల్యే బాలకృష్ణ టీడీపీ మద్దతుదారులు, వారి కుటుంబాలను, కార్యకర్తలను పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ మద్ధతుదారులు ధైర్యంగా ఎన్నికలను ఎదుర్కోవాలని ప్రతి ఒక్కరికి పార్టీ అండగా ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ పాలన దారుణంగా ఉందని వారు అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రం వందేళ్లు వెనక్కి వెళ్లిందని అన్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా వైసీపీ నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. మీరు బెదిరిస్తే బెదిరిపోవడానికి ఇక్కడ ఎవరూ ఖాళీగా లేరని హెచ్చరిస్తున్నా జాగ్రత్తగా ఉండండి. మీరు చేసే దానికి రెట్టింపు ప్రతీకారం తీర్చుకుంటామని బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ ఎన్ని అరాచకాలు సృష్టించినా ప్రజలు మాత్రం టీడీపీవైపే ఉన్నారని బాలకృష్ణ చెప్పుకొచ్చారు.