ప్రజల ప్రాణాలతో వైసీపీ ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది – బాలకృష్ణ

Monday, May 3rd, 2021, 11:00:15 PM IST

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నేడు మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ కరోనా సెకండ్ వేవ్ చాలా మంది కుటుంబాల బతుకులను ఛిద్రం చేసిందని అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు యటకు రాకుండా వ్యక్తిగత పరిశుభ్రతను, భౌతిక దూరం పాటిస్తూ సరైన వైద్యం తీసుకుని ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు. హిందూపురం ఆస్ప‌త్రిలో ఆక్సిజన్ అందక 8 మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని అన్నారు.

అయితే హిందూపురం కోవిడ్ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందించాలని వెంటిలేటర్లు, తగిన వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని మంత్రి, కలెక్టర్, డీఎంఅండ్‌హెచ్ఓ‌తో మాట్లాడానని బాలకృష్ణ తెలిపారు. ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోవాలని బాలకృష్ణ డిమాండ్ చేశారు. కోవిడ్ ఆస్పత్రిలో బాధితులకు సరైన వైద్యం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజల ప్రాణాలతో వైసీపీ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని బాలకృష్ణ అన్నారు. రాష్ట్రంలో ఎటు చూసిన చావు కేకలు వినిపిస్తున్నాయని, ప్రజల్లో అభద్రతా భావం పెరిగిపోయిందని ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రజలకు సరైన వైద్య సౌకర్యాలు కల్పించాలని బాలకృష్ణ కోరారు.