ఏ కారణం తో అడ్వోకేట్లు, జడ్జి ల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు?

Wednesday, August 19th, 2020, 03:02:22 PM IST

yanamala ramakrishnudu

చంద్రబాబు నాయుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై లేఖ రాయడం తో, వైసీపీ నేతలు, డీజీపీ తాజాగా స్పందించారు. అయితే ఈ వ్యవహారం పై తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు ప్రధానికి లేఖ రాస్తే హోం మంత్రి, డీజీపీ భుజాలు తడుముకోవడం ఏమిటి అంటూ సూటిగా ప్రశ్నించారు.

అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఫోన్ ట్యాపింగ్ లో సుప్రీం కోర్టు పేర్కొన్న హేతుబద్ధ కారణాలు ఏమైనా ఉన్నాయా అని యనమల ప్రశ్నించారు.ఆర్టికల్ 19,21 ప్రకారం ఇది రాజ్యాంగ, కేంద్ర చట్టాల ఉల్లంఘనే అంటూ రాష్ట్ర ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ పౌర హక్కులను, ప్రాథమిక హక్కులను కలరాయడమే అంటూ వ్యాఖ్యానించారు. ప్రధాని స్పందించే వరకు డీజీపీ, హోం మంత్రి ఎందుకు ఆగలేక పోయారు అని సూటిగా ప్రశ్నించారు. అంతేకాక వాదనలు వినిపించే న్యాయవాదుల ఫోన్ ట్యాపింగ్ చేయడం కన్నా తీవ్రం మైన నేరం మరొకటి లేదు అంటూ మండిపడ్డారు.

అంతేకాక ఏ కారణం తో అడ్వోకెట్లు, జడ్జి ల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు అంటూ రాష్ట్ర ప్రభుత్వం పై సంచలన ఆరోపణలు చేశారు. ట్యాపింగ్ సర్వీస్ ప్రొవైడర్ల కి లిఖిత పూర్వక ఆదేశాలను ఏమైనా అందజేశారా అని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లో రాష్ట్ర ప్రభుత్వమే ముద్దాయి అని, ముద్దాయి సాక్ష్యాలు ఇవ్వాలి అని అడగడం ఎక్కడైనా ఉందా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకి వైసీపీ నేతలు విమర్శలు చేస్తుండగా, మరొకసారి యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.