మాఫియా రాజ్యమేలుతుంది.. టీఆర్ఎస్ సర్కార్‌పై మండిపడ్డ ఎల్.రమణ..!

Wednesday, February 24th, 2021, 03:00:36 AM IST


టీఆర్ఎస్ ప్రభుత్వంపై టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల స్థానానికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీడీపీ తరపున నామినేషన్ వేసిన ఎల్. రమణ రాష్ట్రంలో ల్యాండ్, డ్రగ్, శాండ్ మాఫియా రాజ్యమేలుతోందని ఆరోపించారు. ఉద్యోగాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు.

అంతేకాదు ఎన్నికలకు ముందు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదని, ఉద్యోగులకు పీఆర్సీ, డీఏ ఇవ్వలేదని, కరోనా సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను గాలికొదిలేసిందని అన్నారు. అయితే తాను 27 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నానని, రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పనిచేశానని నను గెలిపిస్తే వివిధ వర్గాల సమస్యలను మండలిలో వినిపిస్తానని రమణ అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైద్రాబాద్ జిల్లాలు అభివృద్ధి చెందాయని ఆయన పేర్కొన్నారు.