జగన్ కోర్టుకి హజరు కాకుండా ఎందుకు విచారణ ఆలస్యం చేస్తున్నారు?

Sunday, September 13th, 2020, 03:04:10 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో జరుగుతున్న పరిణామాల పై తెలుగు దేశం పార్టీ నేతలు అధికార పార్టీ పై వరుస విమర్శలు చేస్తున్నారు. నేరగాళ్లకు వైసీపీ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అంటూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.తాజాగా సుప్రీం కోర్టు ప్రజా ప్రతినిదుల పై వివిధ కోర్టుల్లో ఉన్న కేసుల వివరాల అందజేయాలి అంటూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలను జారీ చేయడం జరిగింది.

అయితే సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి మరియు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి లతో సహ వైసీపీ నేతలకి భయం పట్టుకుంది అంటూ విమర్శించారు. అయితే 50 మంది వైసీపీ ఎమ్మెల్యే ల పై సీరియస్ క్రిమినల్ కేసులు, తొమ్మిది మంది మంత్రుల పై క్రిమినల్ కేసులు, మరో 7 గురి ఎంపీ ల పై అత్యాచార కేసులు ఉన్నాయి అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే తమ పై ఇలా ఉన్న కేసుల విచారణ త్వరగా జరపాలి అని సీఎం జగన్, విజయ సాయి రెడ్డి ఒక లేఖ అయిన రాయగలరా అంటూ సూటిగా ప్రశ్నించారు.

లేఖ సంగతి తర్వాత కనీసం విజయసాయి రెడ్డి ఒక్క ట్వీట్ అయిన చేయగలరా అంటూ వరుస ప్రశ్నలు వేస్తున్నారు. అంతేకాక సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం నాడు కోర్టుకి హాజరు కాకుండా ఎందుకు విచారణ ఆలస్యం చేస్తున్నారు అంటూ సూటిగా ప్రశ్నించారు. మరి వెంకట్రావ్ చేసిన ఈ వ్యాఖ్యల పై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.