కరోనాను అడ్డుపెట్టుకొని కక్ష్య సాధింపులకు పాల్పడుతున్నారు – కళా వెంక్రటావ్

Saturday, May 8th, 2021, 01:30:19 AM IST

ఏపీలోని కర్నూలులో ఎన్440కే అనే కొత్త కరోనా స్ట్రెయిన్ గుర్తించారని, ఇది మరింత ప్రమాదకరమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయనపై కర్నూలు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు కూడా నమోదు అయ్యింది. అయితే దీనిపై స్పందించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంక్రటావ్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

రాష్ట్రంలో ఓ పక్క కరోనా ఉదృత్తి పెరుగుతుంటే ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎన్440కే వైరస్‌పై ఈ నెల 4న హిందూ దినపత్రికలో వచ్చిన కథనాన్నే చంద్రబాబు మీడియా ముందు మాట్లాడరని అన్నారు. కరోనాపై సాధారణ పౌరులైనా తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వెల్లడించవచ్చని సుప్రీం కోర్టు పేర్కొందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కరోనాను అడ్డుపెట్టుకొని రాజకీయ ప్రత్యర్థులపై కక్షసాధింపు చర్యల్లో సీఎం జగన్ దృష్టి సారించారని, ధూళిపాళ్ల నరేంద్ర, దేవినేని ఉమపై పెట్టింది కూడా అక్రమ కేసులేనని కళా వెంక్రటావ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఆక్సిజన్, వెంటిలేటర్లు, మందులు దొరక్క వందలాది మంది చనిపోతున్నారని ప్రభుత్వం ముందు వీటిపై ఫోకస్ పెట్టాలని సూచించారు.