చంపేస్తానని బెదిరిస్తున్నాడు.. కోడెల కుమారుడుపై టీడీపీ నేత ఫిర్యాదు..!

Monday, February 8th, 2021, 03:51:11 PM IST

ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్, దివంగత టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు మరణం తర్వాత ఆయన తనయుడు కోడెల శివరాంపై పలు కేసులు నమోదయ్యాయి. కే ట్యాక్స్ పేరుతో రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారుల నుంచి భారీగా నగదు వసూలు చేసినట్లు శివరామ్‌తో పాటు ఆయన సోదరిపై ఇప్పటికే దాదాపు 20కి పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా కోడెల శివరాంపై మరో కేసు నమోదయ్యింది.

అయితే గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం గణపవరానికి చెందిన టీడీపీ నేత, మద్యం వ్యాపారి నర్రా రమేష్ శివరాంపై ఈ ఫిర్యాదు చేశారు. తన తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకొని 2019 ఎన్నికల సందర్భంగా ఓటర్లకు పంచేందుకు కోడెల శివరాం తన వద్ద రూ.1.30 కోట్ల విలువ చేసే మద్యాన్ని తీసుకున్నారని, అయితే ఇప్పటి వరకు డబ్బులు చెల్లించకపోగా తనను చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే శివరాం నుంచి తనకు రక్షణ కల్పించడంతో పాటు న్యాయం చేయాలని రమేష్ పోలీసులను కోరారు.