జగన్ పాలనలో ఏపీ జూదాంధ్రప్రదేశ్‌గా మారింది.. దివ్యవాణి మండిపాటు..!

Sunday, November 8th, 2020, 11:07:38 PM IST

వైసీపీ పాలనపై టీడీపీ నాయకురాలు దివ్యవాణి మండిపడ్డారు. ఏపీని నవ్యాంధ్రగా తీర్చిదిద్దాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆకాంక్షిస్తే, వైసీపీ పాలనలో జూదాంధ్రప్రదేశ్‌గా మార్చారని ఆరోపించారు. ఇంకొద్ది రోజులు పోతే సచివాలయాన్ని కూడా పేకాట కేంద్రంగా మార్చేలా ఉన్నారని అన్నారు. పేకాట నిర్వాహకులతో సంబంధాలున్న ఎమ్మెల్యే శ్రీదేవిపై చర్యలు తీసుకోవాలని, ఎమ్మెల్యే పదవికి ఆమె అనర్హురాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే వైసీపీ బహిష్కృత నేత శృంగారపాటి సందీప్‌ ఈ పేకాట వ్యవహారంపై ఓ ఆడియోను విడుదల చేశారు. అయితే అందులో పేకాట ఆడిద్దామని సందీప్‌తో శ్రీదేవి అన్నట్టుగా ఉంది. టీడీపీలో ప్రత్తిపాటి పుల్లారావు, మోదుగుల క్లబ్‌లు నడిపించారని మనం కూడా పేకాట ఆడిద్దామని సందీప్‌తో శ్రీదేవి మాట్లాడింది. ఫిరంగిపురం మండలంలో ఆడిద్దామని శివరామిరెడ్డి అంటున్నాడని, 5 శాతం ఇస్తామని కూడా చెబుతున్నట్టు అందులో ఉంది. దీంతో శ్రీదేవి పేకాట వ్యవహారం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతుంది.