బీసీ ల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్ కి, విజయసాయి రెడ్డి కి లేదు

Wednesday, September 30th, 2020, 03:00:25 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అధికార పార్టీ వైసీపీ మరియు ప్రతి పక్ష పార్టీ తెలుగు దేశం పై ఒకరి పై మరొకరు వరుస విమర్శలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో తెలుగు దేశం పార్టీ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ ల గురించి మాట్లాడే నైతిక హక్కు సీఎం జగన్ మోహన్ రెడ్డి కి మరియు ఎంపీ విజయసాయి రెడ్డి కి లేదు అని అన్నారు. 850 ముఖ్యమైన పదవులు మీ జాతి వారికి ఇచ్చుకుకున్నప్పుడు బీసీ లు గుర్తు రాలేదా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా చేసి సజ్జల రామకృష్ణ రెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి లకు పంచినప్పుడు బీసీ ల పై ప్రేమ ఎక్కడికి పోయింది అంటూ ఘాటు విమర్శలు చేశారు.

అయితే బీసీ నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం మీ జాతి నాయకులు సమావేశం పెట్టుకున్నప్పుడు బీసీ ల పై మమకారం ఎక్కడికి పోయింది అని ప్రశ్నించారు. బీసీ లకు వెన్నుదన్నుగా నిలిచిన ఆదరణ పథకం ఎత్తేసి, నిధులను పక్కదారి పట్టించి ఆర్దికంగా నూ రిజర్వేషన్లు తగ్గించి, రాజకీయంగానూ బీసీ లకు జగన్ రెడ్డి వెన్నుపోటు పొడిచినప్పుడు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎక్కడున్నారో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.