సీఎం జగన్ పై పట్టాభి కీలక వ్యాఖ్యలు

Tuesday, December 15th, 2020, 02:19:56 PM IST

పంటల భీమా విషయం లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శాసన సభ లో చెప్పిన దానికి, పత్రికా ప్రకటనలకు పొంతన లేదు అంటూ తెలుగు దేశం పార్టీ నేత పట్టాభి వ్యాఖ్యానించారు. వైఎస్సార్ పంటల భీమా కి, నేడు 1,252 కోట్ల రూపాయలు ఇస్తున్నాం అని ప్రకటన ఇచ్చి కేవలం 918 కోట్ల రూపాయలు మాత్రమే జమ చేస్తున్నారు అని సంచలన ఆరోపణలు చేశారు. అయితే భీమా అర్హత కలిగినటువంటి రైతుల సంఖ్య ను కూడా 9 లక్షల మేరకు తగ్గించారు అని ఆరోపించారు. అయితే టీడీపీ హయం లో చేసిన చర్యలను వివరించే ప్రయత్నం చేశారు పట్టాభి.

తెలుగు దేశం పార్టీ హయం లో 2019 లో రైతులకు 1,819 కోట్ల రూపాయల భీమా వచ్చింది అని పట్టాభి ఈ నేపథ్యం లో గుర్తు చేశారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 918 కోట్ల రూపాయలు మాత్రం ఇవ్వడం ఏమిటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం తో పోల్చితే కనీసం 50 శాతం కూడా పంటల భీమా ఇవ్వలేదు అని పేర్కొన్నారు. అయితే భీమా ప్రీమియం కూడా కట్టకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతుల్ని నట్టేట ముంచారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పట్టాభి చేసిన వ్యాఖ్యలకి వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.