కిడ్నాప్ కేసులో టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి అరెస్ట్..!

Wednesday, January 6th, 2021, 11:39:35 PM IST


బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో మరో టీడీపీ నేత అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఏ1గా ఉన్న టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిని తాజాగా హైదరాబాద్‌లోని ఆయప్ప సొసైటీ దగ్గర టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కిడ్నాప్ కేసులో ఏ1గా సుబ్బారెడ్డి, ఏ2గా మాజీ మంత్రి అఖిలప్రియ, ఏ3గా అఖిలప్రియ భర్త భార్గవరామ్‌ ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కాగా బోయిన్‌పల్లి కిడ్నాప్‌, భూవివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఈ కేసులో తనను ఎందుకు ఏ1గా చేర్చారో తెలియదని ఏవీ సుబ్బారెడ్డి అన్నారు. గతంలో మాజీమంత్రి భూమా అఖిలప్రియపై కేసు పెట్టానని, తనను పంచడానికి ఆమె సుపారీ కూడా ఇచ్చిందని అలాంటి వారితో కలిసి తానెందుకు కిడ్నాప్‌లకు పాల్పడతానని ఏవీ సబ్బారెడ్డి ప్రశ్నించారు. కిడ్నాప్‌ కేసులో పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని ఆయన అన్నారు.

ఇదిలా ఉంటే నిన్న రాత్రి సీఎం కేసీఆర్ సమీప బంధువులైన మాజీ బ్యాడ్మింటన్ ఆటగాడు ప్రవీణ్ కుమార్ ఆయన సోదరులు నవీన్, సునీల్‌లను కిడ్నాప్‌కు గురవ్వడం నగరంలో కలకలం రేపింది. ఐటీ అధికారులమని ప్రవీణ్ ఇంటికి వచ్చిన దుండగులు ప్రవీణ్, నవీన్, సునీల్‌లను వారి వాహనాల్లో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు దుండగుల వాహనాలను వెంబడించడంతో నార్సింగిలో వదిలి పారిపోయారు. దీంతో ప్రవీణ్, నవీన్, సునీల్ సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. అనంతరం ఈ ఘటంపై విచారణ చేపట్టగా హాఫీజ్‌పేటలోని ఓ భూమి విషయంలోనే వీరిని కిడ్నాప్ చేసినట్టు తెలిసింది.