స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయం లో సీఎం జగన్ కి అచ్చెన్న సూటి ప్రశ్న

Wednesday, March 10th, 2021, 07:31:00 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయం పట్ల రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నాయి. అయితే అధికార పార్టీ వైసీపీ పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ కి సీఎం జగన్ రాసినటువంటి లేఖ చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. అయితే స్టీల్ ప్లాంట్ పై చిత్త శుద్ధి ఉంటే ఎంపీలు అంతా రాజీనామా లు చేయాలని అచ్చెన్నాయుడు సూచించారు. అయితే స్టీల్ ప్లాంట్ ప్రయోజనాల కోసం ఎక్కడికైనా వచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పలు ప్రశ్నలు సంధించారు.

విశాఖ ఉక్కు పై ఒక్కసారైనా అఖిల పక్ష సమావేశం నిర్వహించారా అని నిలదీశారు. ఏనాడైనా ఢిల్లీ వెళ్లి మాట్లాడారా, ఇప్పుడు అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకు వెళ్తానంటే ఎవరు నమ్ముతారు అంటూ దిమ్మ తిరిగే ప్రశ్న వేశారు. 23 మంది ఎంపీ లు ఉన్నా మాట్లాడేందుకు సమయం ఇవ్వరా అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే స్టీల్ ప్లాంట్ భూముల పై జగన్ కి ఉన్న ఆశ, త్యాగాల పై లేదు అని అచ్చెన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్పే ప్రతి మాట అబద్దమే అని, జగన్ రాసే లేఖలు ఢిల్లీ లో పట్టించుకొనే వారు లేరు అని విమర్శించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ను సంప్రదించిన తర్వాతే ప్రైవేటీకరణ చేపట్టినట్లు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.