అమరావతి రైతుల పై ఇది ప్రభుత్వ నిర్బంధమా?

Wednesday, December 2nd, 2020, 07:16:46 PM IST

తెలుగు దేశం పార్టీ అమరావతి రైతుల పక్షాన నిలబడి పోరాడుతున్న సంగతి తెలిసిందే. అమరావతి రాష్ట్ర రాజధాని విషయం లో వైసీపీ అనుసరిస్తున్న తీరు పట్ల అమరావతి ప్రాంత ప్రజలతో పాటుగా, టీడీపీ నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరోమారు వైసీపీ తీరును ఎండగడుతూ తెలుగు దేశం పార్టీ సోషల్ మీడియా వేదిక గా పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. రైతుల పట్ల అనుసరిస్తున్న వైఖరిని ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పై వరుస విమర్శలు చేస్తోంది.

సచివాలయనికి వెళ్ళాలి అంటే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి వేల మంది పోలీసుల భద్రత కావాలి అంటూ చెప్పుకొచ్చింది. శాసన సభ సమావేశాలు జరుగుతుంటే పోలీసులు అంతా అమరావతి రైతుల ఇళ్ళ ముందు, పొలాల్లోనూ ఇలా మోహరిస్తారు అంటూ విమర్శించారు. అమరావతి రైతుల పై ఇది ప్రభుత్వ నిర్బంధమా? భయమా? అంటూ రాష్ట్ర ప్రభుత్వం ను టీడీపీ సూటిగా ప్రశ్నించడం జరిగింది. అమరావతి రైతులకు ఎంత అన్యాయం చేస్తే ఇంత భయపడతారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే పొలం పనులు చేస్తున్న అమరావతి రైతులకు పోలీస్ పహారా అంటూ టీడీపీ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.