టీడీపీకి మరో షాక్.. క్రిస్టియన్ సెల్ నేతలంతా మూకుమ్మడి రాజీనామా..!

Tuesday, January 12th, 2021, 07:40:44 PM IST

ఏపీలో ప్రతిపక్ష టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రామతీర్థం పర్యటన సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఓ మతం నేతల్లో అసంతృప్తిని రగిల్చాయి. రాష్ట్రంలో ఆలయాలకు, విగ్రహాలకు రక్షణ లేకుండా పోయిందని, ముఖ్యమంత్రే మత మార్పిడులను ప్రోత్సహిస్తున్నాని చంద్రబాబు ఆరోపించారు. అయితే చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు క్రిస్టియన్ నేతల్లో కాక రేపాయి.

అయితే క్రిస్టియన్లపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సరికాదని ఇటీవలే మాజీ ఎమ్మెల్యే ఫిలిప్ సి తోచర్ టీడీపీకి గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా టీడీపీ క్రిస్టియన్ సెల్ కూడా రాజీనామా చేసింది. క్రిస్టియన్ సెల్ నేతలంతా మూకుమ్మడిగా పార్టీకి గుడ్‌బై చెప్పారు. క్రైస్తవ సమాజాన్ని చంద్రబాబు అవమానించారని అందుకే పార్టీనీ వీడుతున్నామని వారు చెప్పుకొచ్చారు. క్రైస్తవులపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.