2023లో తెలంగాణకు సామాన్యుడే సీఎం అవుతాడు – తరుణ్‌ ఛుగ్‌

Saturday, December 19th, 2020, 07:29:34 AM IST

టీఆర్ఎస్ పార్టీపై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ ఛుగ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమితో గాబరాపడ్డ సీఎం కేసీఆర్ ఆగమేఘాల మీద జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించారని‌ అన్నారు. అయినా జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో టీఆర్‌ఎస్‌కు ట్రైలర్‌ మాత్రమే చూపించామని అసలు సినిమా ముందుందని వ్యాఖ్యానించారు.

దేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో తండ్రీకొడుకుల, కొన్ని రాష్ట్రాల్లో తల్లీబిడ్డల పాలన చూశానని కానీ తెలంగాణలో హిందూ అవిభాజ్య కుటుంబ పాలన సాగుతోందని అన్నారు. తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడు, ఆత్మబంధువు(మజ్లీస్)తో కూడిన కుటుంబం రాష్ట్రాన్ని పాలిస్తోందని విమర్శలు గుప్పించారు. ప్రజా ధనాన్ని లూటీ చేస్తూ ఫాంహౌస్‌లో రాజభోగాలు అనుభవిస్తున్నారని అన్నారు. నిజాం పాలనతోపాటు అవినీతిని అంతమొందించే వరకూ బీజేపీ నిద్ర పోదని, తెలంగాణ రాష్ట్రానికి 2023లో సామాన్యుడే సీఎం అవుతారు తప్పా ఏ రాజా సాబ్‌ కుమారుడో, అల్లుడో, నిజాం చెంచానో సీఎం కాడని తరుణ్‌ ఛుగ్ అన్నారు.