తెలంగాణకు రూ.10 కోట్లు ప్రకటించిన తమిళనాడు సర్కార్…!

Monday, October 19th, 2020, 05:52:57 PM IST

తెలంగాణలో గత కొద్ది రోజుల నుంచి ఎడతెరిపులేకుండా కురుస్తున్న వర్షాలకు చెరువులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో పరిస్థితి దయనీయంగా మారింది. లోతట్టు ప్రాంతాలలోనీ చాలా కాలనీలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. కనీసం ముంపు ప్రాంతాలలోని ప్రజలకు తినడానికి తిండి, తాగడానికి నీరు కూడా లభించని పరిస్థితి ఏర్పడింది.

అయితే వరదలతో అతలాకుతలమైన హైదరాబాద్ నగరాన్ని ఆదుకోవడానికి తమిళనాడు ప్రభుత్వం ముందుకు వచ్చింది. వరద సాయంగా తెలంగాణ ప్రభుత్వానికి రూ.10 కోట్లు ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిసామి ఓ లేఖ రాశారు. విపత్కర పరిస్థితులలో తమిళనాడు ప్రజల తరఫున సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.10 కోట్లు ప్రకటిస్తున్నట్టు లేఖలో తెలిపారు.