పుష్కరాలు ఆ ప్రాంతాలలోనే!

Wednesday, September 17th, 2014, 09:17:14 AM IST


తెలంగాణ ఆదిలాబాద్ జిల్లాలో వచ్చే ఏడాది జులై 14 నుండి 25 వరకు జరిగే గోదావరి పుష్కరాలనుఎనిమిది స్థానాలలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ పర్యావరణ, అటవీ శాఖామంత్రి జోగు రామన్న మంగళవారం బాసరలో ఉన్నతాధికారుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గోదావరి పుష్కరాల నిర్వహణలో విజయవంతం కావాలని ప్రత్యేక శ్రద్ధతో ఉన్నట్లుగా పేర్కొన్నారు.

ఈ క్రమంలో పుషరాల కొరకు వచ్చే భక్తుల సదుపాయాల నిమిత్తం ఎంత నిధులు అవసరమవుతాయో తెలిపే నివేదికను సమర్పించాలని రామన్న అధికారులకు సూచించారు. అలాగే జిల్లాలో పుష్కర్ ఘాట్ లను కలిపే అన్ని రహదారులను మరమ్మత్తులు చేయించాల్సిందిగా మంత్రి అధికారులను ఆదేశించారు. ఇక జిల్లాలో డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటేశ్వరరెడ్డిని పుష్కర ప్రత్యేక అధికారిగా నియమిస్తున్నట్లు రామన్న వివరించారు. అలాగే జిల్లాలో సోన్, నిర్మల్, బాసర, ఖానాపూర్, గూడెం, మంచిర్యాల్, వేలాల్ మరియు చెన్నూరులలో పుష్కర ఘాట్ లను ఏర్పాటు చేస్తున్నట్లుగా మంత్రి రామన్న సమావేశంలో పేర్కొన్నారు.