ఏపీ పంచాయితీ ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్..!

Monday, January 25th, 2021, 02:57:26 PM IST

ఏపీలో పంచాయితీ ఎన్నికలపై నెలకొన్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది. ఏపీ సర్కార్‌కు, ఎన్నికల కమీషన్‌కు మధ్య జరిగిన యుద్ధంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎట్టకేలకు విజయం సాధించారు. పంచాయితీ ఎన్నికలకు సుప్రీం కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పంచాయితీ ఎన్నికలు వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వంతో పాటు ఉద్యోగ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిక్ రిషికేష్ రాయ్ నేతృత్వంలోని బెంచ్ ఎన్నికల ప్రక్రియలో కోర్టులు జోక్యం చేసుకోబోవని స్పష్టం చేస్తూ వారి పిటీషన్లను కొట్టిపారేసింది.

అయితే రాజ్యాంగ విచ్ఛిన్నాన్ని అంగీకరించమని ధర్మాసనం తేల్చి చెప్పింది. అంతేకాదు ఎన్నికలతో ఉద్యోగ సంఘాలకు ఏం సంబంధమని, ఉద్యోగ సంఘాలు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని కోర్టు మండిపడింది. కరోనా వ్యాక్సినేషన్ పంపిణీ అసలు ఎన్నికల నిర్వహణకు అడ్డంకే కాదని కోర్టు అభిప్రాయపడింది. రాజ్యాంగం ప్రకారమే ఎస్ఈసీ పనిచేస్తుందని ఈ విషయంలో ఎన్నికల కమీషనర్‌ను తప్పుబట్టడం, ఆయనను నిందించడం సరికాదని కోర్టు చెప్పుకొచ్చింది.