ఎంపీ రఘురామకృష్ణంరాజు కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు..!

Monday, May 17th, 2021, 06:00:00 PM IST


నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్న కారణంగా ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రెండు, మూడు రోజులుగా ఎన్నో మలుపులు తీసుకుంటున్న ఈ కేసు విషయంలో తాజాగా సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రఘురామకృష్ణంరాజును వైద్య పరీక్షల కోసం తెలంగాణలోని సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి పంపించాలని సీఐడీని ఆదేశించింది.

అయితే జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో రఘురామ రాజుకు వైద్య పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. అంతేకాదు ముగ్గురు వైద్యులతో బోర్డు ఏర్పాటు చేయలని సూచిస్తూ, వైద్య పరీక్షలను వీడియోగ్రఫీ చేసి నివేదికను సీల్డ్ కవర్‌లో ఇవ్వాలని కోరింది. అయితే రఘురామకు వైద్య పరీక్షల నిర్వహణ జరిగే కాలాన్ని జ్యుడిషియల్ కస్టడీగా పరిగణించాలని చెబుతూ, ఆయనకు కల్పించిన వై కేటగిరీ భద్రతను కూడా కొనసాగించాలని ధర్మాసనం సూచించింది. దీనిపై తదుపరి విచారణను సుప్రీం కోర్టు మే 21కి వాయిదా వేసింది.